Wednesday, October 15, 2008

సుమతీ శతకం poem8

ఈ రోజు మనం తెలుసుకోబోయే సుమతీ పద్యం ఇదే...

ఇమ్ముగఁ జదువని నోరును

అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్

దమ్ములఁ బిలువని నోరును

గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

తాత్పర్యం: ఇంపుగా పఠింపని నోరు, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు, తమ్ముడూ అని పిలవని నోరు కుమ్మరివాడు మన్ను తవ్విన గోయితో సమానం సుమా!


ఈ సృష్టిలో ప్రతీ జీవి తన భావాలని ఇంకో జీవికి తెలియపరుస్తుంది ఏదో ఒక రకంగా..ఏ సైగలతోనో...కానీ, మరే జీవికీ లేనిది, మనుషులకి మాత్రమే ప్రత్యేకంగా దేవుడిచ్చిన వరం...మాట్లాడగలగడం. కానీ, చాలా సార్లు చాలామంది మనుషులు నోరు తినడానికి మాత్రమే ఉన్నట్టు ప్రవర్తిస్తారు. లేదా...ఏదయినా మాట్లడేయచ్చు నోరు ఉంది కాబట్టి అన్నట్టు ప్రవర్తిస్తుంటారు.


ఈ పద్యం లో చూడండి ఏమి చెప్పారో...చక్కగా నోరారా చదవని, అమ్మా, తమ్ముడూ..అని ప్రేమగా పిలవని నోరు...మట్టి గుంటతో సమానం అంటున్నారు. దీనితో పాటు మనం పాటించాల్సింది ఇంకోటి ఉంది. మనకి నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా అని నోటికెంత మాటొస్తే అంత మాటలు మాట్లాడకూడదు. మీరు గమనిస్తే, ఎదుటి వాళ్లు భయం చేతనో, ప్రేమ చేతనో ఎదురు మాట్లాడలేరు అనుకున్నప్పుడే అలా అడ్డదిడ్డంగా మాట్లాడే పొగరు వస్తుంది. ఉదాహరణకి చాలా మంది పై అధికారులు తమ క్రింద పని చేసే వాళ్ళతోనో, వాళ్ళతో పని ఉండి వచ్చిన వారితోనో, లేకపోతే చాలా మంది భర్తలు భార్యలతోనూ...ఇలా నోటితో పెత్తనం చెలాయిస్తుంటారు. మన మీద ఆధారపడ్డారు అనుకుంటే ఎంత చిన్న చూపు చూస్తామో కదా...! చాలామందికి ఈ విషయంలో తమ మీద తమకి చాలా నమ్మకం...మేమే చాలా గొప్పగా, సరిగ్గా ఆలోచనలు చేస్తాము అని.


చాలా మంది తల్లితండ్రులు కూడా చాలా విషయాల్లో పిల్లల ఆలోచనలు సరిగ్గా ఉండవని ముందే గట్టిగా నిర్ణయించేసుకుంటారు. కనీసం వాళ్లు చెప్పేదాన్ని గురించి ఆలోచించకుండానే...మీరు సరిగ్గా ఆలోచించలేరు. మీకు అనుభవం లేదు, చిన్నతనం అని...ముందే నిర్ధారణకి వచ్చేస్తారు. అసలు వాళ్ల అభిప్రాయాన్నిగురించి ఆలోచించే సమయం కూడా కేటాయించరు. పిల్లలని జాగ్రతగ్గా చూసుకోవాలి అనేది వారి బాధ్యత...నిజమే.. కానీ, వారి జీవితం మొత్తం మీరే ఆలోచించి, మీరే నిర్ణయాలు తీసేసుకుంటే...వాళ్ల జీవితాన్ని వాళ్లు జీవిస్తున్నట్టా? లేక మీరా? చదువు గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, పెళ్లి గురించి కానీ, వాళ్ల ఆలోచనల్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి. వాళ్ల జీవితంలో వాళ్ళని ప్రయత్నించనివ్వండి. పొరపాటున ఏదన్నా సమస్య వచ్చినా... నీ నిర్వాకం ఇలాగే ఉంటుదని దెప్పిపొడవడం కూడా మానేయ్యండి. ప్రతీ ఒక్కరి జీవితంలో గెలుపు-ఓటములు సహజం.


ఏ బంధంలోనయినా నిజమైన ప్రేమ అంటే ఎదుటి వారికి స్వేఛ్చనిచ్చి..వారి కష్టం లోనూ, సుఖం లోనూ..నేనున్నాను అని చెప్పడం. అంతే గానీ, మనం అనుకున్నట్టు వాళ్లు ఉండాలని ఆశించడం కాదు. ఇదే నిజంగా తల్లిదండ్రులు-పిల్లల మధ్య అయినా, భార్యాభర్తల మధ్యయినా, చివరికి మంచి స్నేహితుల మధ్యయినా మనం తప్పకుండా పాటించాల్సిన పద్ధతి. అప్పుడే ఏ బంధం అయినా చిరకాలం ఉండిపోవడమే కాకుండా..ఎవరి వల్ల ఎవరూ బాధపడే పరిస్థితి రాదు.


అందుకే మరి...మీరు కూడా మీ ఆలోచనలనే మీ వారిపై రుద్దకుండా వారి అభిప్రాయాలని గౌరవిస్తారు కదూ...!!


ప్రేమతో...

మధుర వాణి



1 comment:

S said...

:) బాగా చెప్పారు!