Sunday, October 19, 2008

సుమతీ శతకం poem10

ఇవ్వాల్టి సుమతీ పద్యం ఇదే...!
ఉత్తమ గుణములు నీచు

కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా

నెత్తిచ్చి కరగిపోసిన

నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ!

తాత్పర్యం: బంగారానికి సమానమైన ఎత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించిపోసినా బంగారం ఎట్లుకానేరదో అదేవిధంగా లోకంలో నీచునకు ఎక్కడా విధంగానూ మంచి గుణాలు కలగవు.


చెడ్డవారి గురించి, మూర్ఖుల గురించీ, నీచ స్వభావం గురించి మన తెలుగులో ఎన్నో తెలుగు పద్యాలు ఉన్నాయి కదా...!

ఇదీ అందులో ఒకటి. ఎన్ని కిలోల ఇత్తడి తెచ్చి ఇచ్చినా బంగారం తో సమానం కాదు అనే ఉపమానం ఉపయోగించి ఈ పద్యంలో నీచుని స్వభావాన్ని వివరిస్తున్నారు.

మంచి-చెడు అంటే నాకొకటి గుర్తొస్తుంది. ఈ ప్రపంచంలో మంచి-చెడు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అసలు అది మన ఆలోచనల్లో ఉంటుందని నాకనిపిస్తుంది. అంటే...మంచి-చెడు అనేవి relativity (తెలుగులో??) కి సంబంధించినవి కదా..అంటే ఒకరి దృష్టిలో మంచి అయినది మరొకరి దృష్టిలో చెడు అయ్యే అవకాశం ఉంది. అలాగే పరిస్థితిని బట్టి మంచిచెడులు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఏదన్నా అపాయంలో ఉన్నప్పుడు ఒక ప్రాణిని చంపినా గాని అది తప్పు అవ్వదు. కానీ, అదే మరో పరిస్థితిలో అయితే తప్పు అవుతుంది కదా..ఒకోసారి ఇద్దరు మనుషులకి భేదాభిప్రాయం వచ్చిందనుకోండి..ఒకరు వచ్చి వారి వైపు నుంచి విషయం చెప్తే... మనకి కూడా వాళ్ళు చెప్పేది కరెక్ట్..వేరే ఇంకొకరిది తప్పు అనిపిస్తుంది. ఒకోసారి ఇరువైపులా వాదనలు సబబుగానే అనిపిస్తాయి. ఎవరి కోణంలోనుంచి చూస్తే వారి వాదన సరియైనది అనిపిస్తుంది. కాబట్టి చాలాసార్లు మనం వేరే వాళ్ల పరిస్థితి మీద మన అభిప్రాయాలను బలంగా వ్యక్తపరచకపోవడమే మంచిది. నేనయితే అలా చేసేదాన్ని కాదు, ఇలా ఊరుకునే దాన్ని కాదు, ఇంకేదో గొప్పగా చేసేదాన్ని ఇలాంటివి కూడా ఎప్పుడూ అనకూడదు. ఒకోసారి అలాంటి మాటలు ఎదుటి మనుషుల మనసుల్ని చాలా గాయపరుస్తాయి. అందుకే మనం వేరే వాళ్ల భావాలు, అభిప్రాయాల గురించి చటుక్కున ఒక మాట అనేయ్యకూడదు. చాలాసార్లు అనేస్తూ ఉంటామనుకోండి :)

నాకు ఇంకో సంగతి గుర్తోచ్చింది. క్రీడాకారులు పాపం చాలా కష్టపడి దేశానికి మంచిపేరు తీసుకొస్తారు. కానీ, వాళ్లు కూడా మామూలు మనుషులే కదా..అదీ కాక ఆటల్లో గెలుపు ఓటములు సమానంగా ఉంటాయి కదా. కానీ మనం మాత్రం, వాళ్లు సరిగ్గా ఆడనప్పుడల్లా, ఇలా ఆడి ఉండాల్సింది, ఆ షాట్ కొట్టకుండా ఉండాల్సింది అని తెగ మాట్లాడేస్తుంటాం. అసలు ఆ ఆటగాడు వేస్ట్ అదీ ఇదీ అని certificates ఇచ్చేస్తుంటాం కూడా. మనకి అసలు అలా మాట్లాడే హక్కు ఉందా? అని ఒక్కసారి కూడా ఆలోచించం. వాళ్లు చేస్తున్నదాంట్లో మనం ఒక శాతం కూడా దేశం కోసం చెయ్యట్లేదు కదా.. అలాంటప్పుడు మనం అలా ఎందుకు అనాలి? మనం ఒక ఆటగాడ్ని అభిమానిస్తున్నప్పుడు గెలిచినప్పుడే కాకుండా ఓడినప్పుడు కూడా అభిమమనం చూపించగలగాలి. మన support వాళ్లకెప్పుడూ ఉండాలి. అంతే కానీ, వాళ్ళని తిట్టి, ఇంటిమీద రాళ్ళేసి, వాళ్ళకి ఇంకా stress ని పెంచకూడదు కదా...పైగా దాని వల్ల ఉపయోగమేముంది? లేదా మనమే వెళ్లి వాళ్ల బదులుగా ఆడాలి చేతనయితే :)

అవునంటారా? కాదంటారా?


ప్రేమతో,

మధుర వాణి

2 comments:

S said...

ఏవిటో ఈ పద్యం!
కాస్త ఓపికుండాలి అని ఇందాకే ఈయనే అన్నారు ఎక్కడో! :P

మధురవాణి said...

@ S,
ఎంత ఓపిక ఉన్నా ఇత్తడి బంగారం గా మారదు కదా! ఎంత ఓపికతో ఉన్నప్పటికీ మారగలిగే అవకాశం ఉన్నదేంటో, ఎప్పటికీ మారదు గాక మారదు అన్నట్టు ఉండేవి ఏంటో తెలుసుకొమ్మనేమో కవి హృదయం! ;)